గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీల ప్రారంభోత్సవం నాటికి వాటిలో పౌర, సామాజిక మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీల గృహప్రవేశానికి ముందే అంతర్గత మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సామాజిక అవసరాలైన పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీహాల్, పోస్ట్ ఆఫీసు, బస్‌షెల్టర్లు, పోలీస్ స్టేషన్లు, ఫైర్ స్టేషన్, బ్యాంకుల ఏర్పాటు, మౌలిక పౌర అవసరాలైన అంతర్గత రోడ్ల నిర్మాణం, త్రాగునీటి సౌకర్యం, డ్రైనేజి, విద్యుత్ తదితర ఏర్పాట్లను పూర్తిస్థాయిలో కల్పించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీతో పాటు జలమండలి, రెవెన్యూ , విద్యుత్, పోలీసు, వైద్య, ఆరోగ్య, హెచ్ఎండిఏ, విద్యా, మార్కెటింగ్ తదితర శాఖల ఉన్నతాధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి నేడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అడిషనల్ కమిషనర్ భారతిహోలీకేరి, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ సీఎండి రఘుమారెడ్డి, చీఫ్ ఇంజనీర్ సురేష్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో కమిషనర్ జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో సామాజిక, పౌర సదుపాయాల కల్పనకు సంబంధిత ప్రభుత్వ శాఖలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 109 ప్రాంతాల్లో చేపడుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రాజెక్ట్‌లలో మౌలిక సదుపాయాల కల్పనపై గత జూన్, జూలై మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం జరిగిందని గుర్తుచేశారు. లక్ష బెడ్‌రూం ఇళ్లలో అంతర్గతంగా విద్యుత్, త్రాగునీటి సరఫరా ఇతర కనీస సదుపాయాలను జీహెచ్ఎంసీ కల్పిస్తోందని పేర్కొన్నారు. అయితే ఆయా కాలనీలలో సోషల్, ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను సంబంధిత శాఖలు చేపట్టాలని కోరారు. 2018 డిసెంబర్ మాసాంతం నాటికి 58 ప్రాంతాల్లో 40వేలు, 2019 జూన్ మాసాంతానికి 51 ప్రాంతాల్లో 60వేల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలనే లక్ష్యానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించాల్సిందిగా ఆయా శాఖలకు కమిషనర్ సూచించారు. అయితే ప్రభుత్వం అనుమతించిన మౌలిక సదుపాయాల పనుల మంజూరు కాకుండా అదనపు సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జాతీయ భవన నిబంధనలను అనుసరించి హౌసింగ్ కాలనీల్లో సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కింద విద్య, ఆరోగ్యం, పోలీస్, ఫైర్ స్టేషన్లు, కమ్యునిటీహాళ్లు, మార్కెట్ తదితర సౌకర్యాలతో పాటు ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా త్రాగునీటి సౌకర్యం, సీవరేజ్, డ్రైనేజీ, రోడ్లు నిర్మించాల్సి ఉంటుందని తెలియజేశారు. మొత్తం 109 లొకేషన్లలో జరుగుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీలలో విద్యుత్ సరఫరాను టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ కల్పించాల్సి ఉంటుందని, అదేవిధంగా ఔటర్ రింగ్‌రోడ్ పరిధిలో ఉన్న 88 కాలనీల్లో త్రాగునీటి సౌకర్యాన్ని అర్బన్ మిషన్ భగీరథ పథకంలో, జీహెచ్ఎంసీ, ఓ.ఆర్.ఆర్ పరిధిలో ఉన్న 88 కాలనీల్లో సీవరేజ్ లైన్ల కల్పనను జలమండలి ద్వారా చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఔటర్ రింగ్‌రోడ్ వెలుపల ఉన్న 28 లొకేషన్లలో మిషన్ భగీరథ క్రింద గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ద్వారా త్రాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంటుందని, జీహెచ్ఎంసీ పరిధి బయట ఉన్న హౌసింగ్ కాలనీల్లో అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని హెచ్.ఎం.డి.ఏ ఆధ్వర్యంలో చేపట్టాల్సి ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ మొత్తం 109 ప్రాంతాల్లో చేపట్టే డబుల్ బెడ్‌రూం ఇళ్ల సదుపాయాల కల్పనపై ఇప్పటికే జలమండలి, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగాలు మాత్రమే రూ. 471.45 కోట్ల అంచనాలను సమర్పించాయని, మిగిలిన శాఖలు వెంటనే కావాల్సిన నిధుల మంజూరుపై ప్రతిపాదనలు సమర్పించాలని జనార్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం నుండి నిధుల మంజూరు వచ్చేలోపే తమ అంతర్గత నిధుల నుండి మౌలిక సదుపాయాల కల్పన పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. ఇప్పటికే తుది దశలో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీల్లో యుద్దప్రాతిపదికపై పనులను ప్రారంభించాలని కమిషనర్ సూచించారు. *డబుల్ బెడ్‌రూం ఇళ్ల పురోగతిపై 16న ఉన్నతస్థాయి సమావేశం* హైదరాబాద్‌లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు 16వ తేదీన సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారని కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, హెచ్.ఓ.డిలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరవుతారని తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీలలో చేపట్టాల్సిన శాఖాపరమైన పనులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలను వెంటనే సమర్పించాలని, 16న జరిగే సమావేశంలో నిధుల మంజూరు, ఇతర విధానపరమైన నిర్ణయాలను ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని కమిషనర్ పేర్కొన్నారు.