గ్రామాల అభివృద్ధి కోసం స్థానికులే మేనిఫెస్టోలు రూపొందించి రాజకీయ పార్టీలకు అందించేలా ‘పీపుల్స్ మేనిఫెస్టో’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. శనివారం ఆయన విశాఖజిల్లా చోడవరంలోని ఉషోదయ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకూ రాజకీయ పార్టీలు తమ తమ సొంత అజెండాలతో మేనిఫెస్టోలు రూపొందించుకుంటున్నాయని, వీటివల్ల గ్రామాలకు పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదన్నారు. అందుకే ఎన్నికల ముందు ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే రాజకీయ నాయకులకు ఆయా గ్రామాల ప్రజలు తమ మేనిఫెస్టోను అందించి, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేసే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అవసరమైతే ఈ మేనిఫెస్టో అమలు చేస్తామంటూ ఆయా రాజకీయ పార్టీల నాయకులతో వంద రూపాయల బాండు పేపరుపై సంతకం కూడా తీసుకునేలా ఈ పీపుల్స్ మేనిఫెస్టో కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. ఈ మేరకు త్వరలోనే ‘మా గ్రామం మేనిఫెస్టో’ పేరిట ఓ వెబ్‌సైట్ కూడా ప్రారంభించనున్నామన్నారు.
ఈ వెబ్‌సైట్‌లో ప్రతి గ్రామ ప్రజలు తమ గ్రామ సమస్యలు, అభివృద్ధిపై డిమాండ్లు ఉంచవచ్చునని తె లిపారు. కాగా, రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా దోపిడీ, అవినీతి, అక్రమాలపై పోరాటానికైనా సిద్ధమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్టును శనివారం సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పర్యటించి ప్రజలతో మమేకమయ్యానని, త్వరలో కృష్ణ, గుంటూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించాక రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తానని వెల్లడించారు.