eenadubusiness.com

పెద్ద మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ వరదల వల్ల వందల మంది నిరాశ్రయులయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిది. ఈ నేపథ్యంలో కేరళ వరద బాధితులకు సినీ పరిశ్రమ నుంచి కొందరు ప్రముఖులు తమ వంతు సాయమందించారు. ఈ వరుసలో హీరో విజయ్ దేవరకొండ ముందున్నాడు.
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కేరళ వరద బాధితులకు 5లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి పంపాడు. దీంతో విజయ్ చూపిన చొరవను పలువురు అభినందిస్తున్నారు. విజయ్‌ను స్పూర్తిగా తీసుకుని పెద్ద హీరోలు, నిర్మాతలు, దర్శకులు ముందుకు రావాలని ఆశిస్తున్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా లక్ష రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి తన పెద్ద మనసును చాటుకుంది. తమిళ పరిశ్రమకు చెందిన హీరోలు సూర్య, కార్తీ 25లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపించారు. తమిళ హీరో విజయ్ అభిమానులు వరదల్లో నష్టపోయిన బాధితులకు బియ్యం, మంచి నీరు పంపిణీ చేస్తూ తమ వంతు సాయం అందిస్తున్నారు.