సంగీత్ జంక్షన్…ఇది నగరంలోని సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ కూడలి. ఈ జంక్షన్ వద్ద సంగీత్ అనే పేరుతో పెద్ద సినిమా థియేటర్ ఉన్నందున సంగీత్ జంక్షన్‌గా పిలుస్తున్నారు. అయితే అప్రహతిహరంగా పెరుగుతున్న హైదరాబాద్ నగరంలో ప్రముఖ సినిమా థియేటర్లు కాలక్రమంలో షాపింగ్ మాల్స్‌గా, వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఇదేకోవలో సంగీత్ థియేటర్ స్థానంలో పెద్ద వ్యాపార సముదాయం వచ్చింది. అయితే ఈ సంగీత్ జంక్షన్‌ను పేరకు తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న పార్కులో సంగీత వాయిద్యాల నమూనాలను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ జంక్షన్‌ను అభివృద్ది చేయడం ద్వారా సరికొత్తగా సుందరంగా ఉండడంతో పాటు సంగీత వాయిద్యాల బొమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా సంగీత్ జంక్షన్‌గా మదిలో ఏర్పడేలా ఈ నమూనాలను తయారు చేయిస్తున్నారు. ఈ సంగీత వాయిద్యాలలో శాస్త్రీయ, ఆధునిక వాయిద్యాలైన డోలక్, బ్యాండ్, వీణ, మృదంగం నమూనాలున్నాయి. వీటి తయారీ పూర్తయిందని, మరో రెండు మూడురోజుల్లోగా సంగీత్ జంక్షన్‌లో ఏర్పాటుచేసి, వీటికి ఆకర్షనీయమైన లైటింగ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లను మరింత ఆకర్షనీయంగా చేయాలన్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ల సూచనల మేరకు జంక్షన్‌ల సుందరీకరణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే లక్డికాపూల్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన రోజ్ గార్డెన్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోందని గుర్తు చేశారు. కాగా ఆకర్షనీయంగా తయారు చేయించిన సంగీత్ వాయిద్యాల బొమ్మలను సంగీత్ జంక్షన్‌లో ఏర్పాటు చేయడంలో నగరవాసులకు ఇందో సరికొత్త సెల్ఫీ స్పాట్‌గా రూపొందనుంది.