eenadubusiness.com

రాయ‌దుర్గ్‌లో ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కారానికి క‌మిష‌న‌ర్ల ప‌ర్య‌ట‌న‌

రాయ‌దుర్గ్ హైటెక్ సిటీ వ‌ద్ద ఏర్పాటుచేసిన బ‌హుళ జాతి సంస్థ ఐకియా షోరూంను సంద‌ర్శించ‌డానికి వేలాది మంది న‌గ‌ర‌వాసులు వ‌స్తుండ‌డంతో త‌లెత్తిన ట్రాఫిక్ ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించ‌డానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ వి.సి.స‌జ్జ‌నార్‌లు నేడు ట్రాఫిక్‌, టి.ఎస్‌.ఐ.ఐ.సి, జీహెచ్ఎంసీ ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. గురువారం నాడు ప్రారంభ‌మైన ఐకియా షోరూం సంద‌ర్శించ‌డానికి వేలాది మంది త‌మ సొంత వాహ‌నాల‌తో రావ‌డంతో తీవ్ర‌మైన ట్రాఫిక్ జాం ఏర్ప‌డి క‌లిగిన ఇబ్బందుల‌ను ప‌లు ప‌త్రిక‌లు నేడు ప్ర‌ముఖంగా ప్ర‌చురించాయి. దీంతో ఈ మార్గంలో వాహ‌నాల రాక‌పోక‌ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, పార్కింగ్‌కు చేప‌ట్టిన ఏర్పాట్లు, ప్ర‌త్యామ్న‌య మార్గాల‌ను క‌మిష‌నర్ ప‌రిశీలించారు. క‌మిష‌న‌ర్‌తో పాటు డిసిపి వెంక‌టేశ్వ‌ర‌రావు, జీహెచ్ఎంసీ ఇంజ‌నీర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.