హైదరాబాద్ నగరంలో సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటుకు రూ. 23వేల కోట్ల వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ది కార్యక్రమం (ఎస్.ఆర్.డి.పి) చేపట్టినట్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు. ఎస్.ఆర్.డి.పి మొదటి దశ రెండో ప్యాకేజీలో భాగంగా రూ. 49కోట్ల వ్యయంతో కామినేని జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్, మననగరం కార్యక్రమంలో భాగంగా మంజూరుచేసిన రూ. 42కోట్ల పనులను నేడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యతో కలిసి ప్రారంభించారు. మేయర్ బొంతు రామ్మోహన్ అద్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ దేశంలోనే ఐదవ అతిపెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్ నగరం 2030 నాటికి మెగా సిటీగా మారనుందని అన్నారు. శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను అదిగమించడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కె.సి.ఆర్ మార్గదర్శకంలో ఎస్.ఆర్.డి.పి కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం 9వేల కోట్ల రూపాయల విలువైన ఎస్.ఆర్.డి.పి పనులు పురోగతిలో ఉన్నాయని, మరో నాలుగు వేల కోట్ల పనుల మంజూరుకు ప్రతిపాదనలు ప్రభుత్వంలో ఉన్నాయని వివరించారు. ఒక ఎల్బీనగర్ జంక్షన్, పరిసర ప్రాంతాల్లోని 448 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, కారిడార్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని కె.టి.ఆర్ గుర్తుచేశారు. ఇప్పటికే అయ్యప్ప సొసైటీ, మైండ్స్‌స్పేస్, చింతల్‌కుంటల వద్ద అండర్‌పాస్‌లను ప్రారంభించామని నేడు రూ. 49 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. మైండ్స్ స్పేస్ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, దీనిని ఈ నెలాఖరులోగా ప్రారంభించనున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడానికి ప్రజా రవాణా వ్యవస్థ ద్వారానే సాధ్యమని అన్నారు. హైదరాబాద్ నగరంలో కేవలం 33శాతం మంది మాత్రమే ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నారని తెలిపారు. నగరంలో 3,800 ఆర్టీసీ బస్సులు, 100సెట్వీన్ బస్సులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా రవాణాను బలోపేతం చేయడంలో భాగంగా ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ మెట్రో రైలును సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనున్నామని తెలిపారు. ఆగష్టు 15వ తేదీన ఎల్బీనగర్, అమీర్‌పేట్ కారిడార్లలో మెట్రో రైలును ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ సీ.ఎం.ఆర్.ఎస్ నుండి తగు సాంకేతిక అనుమతులు రాన్నందువల్లే వచ్చే నెలకు వాయిదా వేశామని తెలిపారు. నాగోల నుండి ఎల్బీనగర్- ఫలక్‌నూమాల మీదుగా శంషాబాద్ వరకు మెట్రోరైలు విస్తరించడం జరుగుతుందని తెలిపారు. ఎం.ఎం.టి.ఎస్ రైలును ఘట్‌కేసర్ నుండి యాదాద్రి వరకు పొడగిస్తున్నామని అన్నారు. నగరవాసులకు ఫుట్‌పాత్‌లపై నడిచే హక్కును కొనసాగించడానికి ఫుట్‌పాత్‌లపై అక్రమంగా నిర్మించిన 8వేలకు పైగా ఆక్రమణలను తొలగించామని, రూ. 100కోట్లతో ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టామని మంత్రి కె.టి.ఆర్ తెలియజేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కేవలం రోడ్ల నిర్మాణానికే రూ. 450 కోట్లు కేటాయించామని, ఇటీవల నిర్వహించిన మన నగరం కార్యక్రమంలో వివిధ కాలనీల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రూ. 42కోట్ల విలువైన పనులను మంజూరు చేశామని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఉన్న భూ సంబంధిత వివాదాలను ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి వాటిని పరిష్కరించడం ద్వారా వేలాది మందికి లబ్ది చేకూరిందని తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ 46వేల కోట్లతో ఎస్.ఆర్.డి.పి పనులను చేపట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని గుర్తు చేశారు. మిషన్ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణయ్య మాట్లాడుతూ ఒక ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే రూ. 1600 కోట్ల విలువైన అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ కేవలం 16 నెలల రికార్డు సమయంలో కామినేని జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తిచేశామని తెలిపారు. జలమండలి పైప్‌లైన్ తొలగిస్తే కుడి వైపు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మూడు నెలలలోనే పూర్తిచేస్తామని పేర్కొన్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడతూ ప్రపంచ శ్రేణి ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి మున్సిపల్ మంత్రి కె.టి.ఆర్ నాయకత్వంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు, వ్యూహాత్మక రహదారుల అభివృద్ది, స్వచ్ఛ హైదరాబాద్, రోడ్ల నిర్మాణం ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎం.బి.సి ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ, కార్పొరేటర్లు, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, అడిషనల్ కమిషనర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.