eenadubusiness.com

మొబైల్ యాప్ లోచూపిస్తే ఓకే…..

వాహనచోదకులకు శుభవార్త. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు.. తదితర పత్రాలను డిజి లాకర్ యాప్ లేదా ఎంపరివాహన్ మొబైల్ యాప్ లో భద్రపరచుకుంటే సరిపోతుంది. వీటిలో భద్రపరచుకున్న పత్రాలను ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు వారికి చూపిస్తే సరిపోతుందని, ఈ నిబంధ నేటి నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు పంపింది. ఈ యాప్స్ లో ఉన్న పత్రాలను అధికారిక ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలని ఆదేశించింది. కాగా, ‘డిజిలాకర్’ లో ఉన్న వాహన పత్రాలను చూపిస్తే పోలీసులు వాటిని అధికారిక పత్రాలుగా గుర్తించడం లేదని వాహనదారుల నుంచి కేంద్ర రవాణా శాఖకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తొలిసారిగా ‘డిజిలాకర్’లో ఉన్న పత్రాలను లీగల్ డాక్యుమెంట్స్ గా పరిగణించారు.