eenadubusiness.com

ముగిసిన కరుణానిధి శకం: మృత్యువుతో పోరాడుతూ కన్నుమూత

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజధాని చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం గం.6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కరుణ మృతి విషయం తెలియగానే పెద్ద ఎత్తున డీఎంకే కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఆయన మృతి విషయం తెలియగానే అభిమానులు సొమ్మసిల్లిపడిపోయారు. ఆయన ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రెండు రోజులుగా ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. కరుణ కిడ్నీ, లివర్‌కు ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపారు. వయోభారం కారణంగా చికిత్సకు శరీరం సహకరించడం లేదన్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసినప్పటి నుంచే కార్యకర్తలు తరలి వచ్చారు.