eenadubusiness.com

వంట చేయమనడం హింసించినట్లు కాదు

రుచిగా వండాలని, ఇంటి పనులు చేయాలని భార్యకు భర్త చెప్పడంలో ఎలాంటి తప్పులేదని, అది హింసించినట్లు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 17 ఏళ్ల క్రితం ముంబయిలోని సంగ్లి ప్రాంతానికి చెందిన విజయ్‌ అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో కలిసి భార్యను ముప్పుతిప్పలు పెడుతుండటంతో ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి పనులు సరిగ్గా చేయనందుకు విజయ్‌ రోజూ కొట్టి హింసించేవాడని.. అతనికి మరొకరితో వివాహేతర సంబంధం ఉందని బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ వివరాలను లేఖలో రాసి చనిపోయింది. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం బాంబే హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది.‘భార్య సరిగ్గా వంట చేయడంలేదని, ఇంటి పనులు చూసుకోవడంలేదని భర్త చెప్పినంత మాత్రాన అది హింసించినట్లు కాదు. ఈ కేసుకూ అదే వర్తిస్తుంది. విజయ్‌ హింసించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు లేవు. అంతేకాదు విజయ్‌కు ఎలాంటి వివాహేతర సంబంధాలు లేవు. ఈ కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్‌ లాయర్‌ నిందితుల కుటుంబీకులను సరిగ్గా విచారించలేదు. కాబట్టి వారిని దోషులుగా ప్రకటించలేం.’ అని న్యాయమూర్తి సరంగ్‌ కోత్వాల్‌ తెలిపారు.1998లో విజయ్‌కు వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత విజయ్‌ తనను హింసిస్తున్నాడని, వంట సరిగ్గా చేయడంలేదని వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఇంట్లోవారికి చెప్పింది. 2001 జూన్‌5న బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు ఆ ఇంటికి ఆమె తాతయ్య వెళ్లాడు. అప్పటికే విజయ్‌ తన భార్యతో గొడవపడుతూ కన్పించాడు. ప్రతి చిన్న విషయానికి కొట్టుకోకూడదని , అన్యోన్యంగా ఉండాలని బాధితురాలి తాతయ్య నచ్చజెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బాధితురాలు తన తాతయ్యకు మెసేజ్‌ పంపింది. ఆమె చనిపోయిన మరుసటి రోజు మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అత్తింటి వారితో సమస్యలు ఉన్నాయని వారు చెప్పలేదని.. ఈ కేసులో విజయ్‌ను దోషిగా తేల్చలేమని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.