జీహెచ్ఎంసీలో విపత్తుల నివారణకై ప్రత్యేక బలగంతో పాటు వాహనాలతో కూడిన విభాగాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు శనివారం నాడు ప్రారంభించారు.. దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో కేవలం జీహెచ్ఎంసీలోనే విపత్తుల నివారణకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి హంగులతో కూడిన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఐపీఎస్ అధికారి విశ్వజిత్‌కంపాటి డైరెక్టర్‌గా ఉన్న ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌లో 120 మంది ప్రత్యేక సిబ్బంది, 8 వాహనాలు, విపత్తులను ఎదుర్కోవడానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చారు. జీహెచ్ఎంసీలోని విద్యుత్, ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో ఉన్న అదనపు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌లో నియమించి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఆకర్షనీయమైన డ్రెస్, హెల్మెట్, షూస్ తదితర రక్షణ సౌకర్యాలను ఈ సిబ్బందికి అందించారు. గత నెలరోజులుగా శిక్షణ పొందిన ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పనితీరును మేయర్ బొంతు రామ్మోహన్ ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫోర్స్ చేసిన కవాతును పరిశీలించడంతో పాటు విపత్తుల సమయంలో వారు చేపట్టే చర్యల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉత్తమ పనితీరు ద్వారా ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. నగర ప్రజలకు ఉత్తమ జీవన ప్రమాణాలను అందించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరులు పాల్గొన్నారు.