హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించే ఇనుము, ఇతర ముడి పదార్థాలను క్వాలిటీ కంట్రోల్ విభాగంచే పరీక్షించిన అనంతరమే నిర్మాణాలకు ఉపయోగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై నేడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అడిషనల్ కమిషనర్ భారతి హోలీకేరి, చీఫ్ ఇంజనీర్ సురేష్, గృహనిర్మాణ విభాగం ఇంజనీర్లు పాల్గొన్న ఈ సమీక్ష సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ నాణ్యతలో రాజీపడవద్దని సూచించారు. బి.ఐ.ఎస్ తదితర ప్రామాణిక సంస్థలు నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా బిల్డింగ్ మెటీరియల్ ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాలపై శాఖాపరమైన క్వాలిటీ కంట్రోల్ విభాగంతో పాటు జె.ఎన్.టి.యు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లతో తనిఖీలు చేయించాలని సూచించారు. నగరంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్‌రూంలలో డిసెంబర్ మాసాంతం నాటికి 40,261ఇళ్లు పూర్తి అవుతాయని మరోసారి స్పష్టం చేశారు. ఆగష్టు మాసాంతంలోగా జియాగూడ, సయ్యద్‌సాబ్‌కా బాడా, కిడికిదూద్ అలిషా, కట్టెల మండి, జమ్మిగడ్డలలో 1,032 ఇళ్లు ప్రారంభానికి సిద్దమవుతాయని తెలిపారు. గాజుల రామారం, అమీన్‌పూర్‌లలో నిర్మించిన 320 ఇళ్లు సిద్దమయ్యాయని తెలియజేశారు. వచ్చే సంవత్సరం జూన్ మాసాంతంలోగా మొత్తం లక్ష ఇళ్లు పూర్తవుతాయని తెలియజేశారు.