భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ పట్ల సమాజంలోని వివిధ వర్గాలకి అవగాహన కల్పించడం కోసం విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యంతో ఏర్పాటుచేయ తలపెట్టిన ఎన్నికల అవగాహనా సమితులు (ఎలక్ట్రోరల్ లిటరసి క్లబ్)కి సంబంధించిన హైదరాబాద్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి మరియు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటిదని, ఆ ప్రక్రియను మరింత పారదర్శకంగా కొనసాగించడానికి సమాజంలోని అన్ని వర్గాలకు ఎన్నికల ప్రక్రియ, ఓటరు నమోదుకు సంబంధించిన పూర్తి అవగాహన ఉండాలని పేర్కొన్నారు. దీని కోసం ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఇందులో భాగంగానే ఎన్నికల అవగాహన సమితుల పేరు మీద సరికొత్త కార్యక్రమం రూపొందించాలని తెలిపారు. ఈ సమితుల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మొదలుకొని విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థుల వరకు వివిధ స్థాయిలో క్లబ్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ, ఎలక్ట్రానిక్ కౌంటింగ్ మిషన్ ఓటరు నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులలో భవిష్యత్ ఓటర్ల క్లబ్, కళాశాల విద్యార్థులతో కొత్త ఓటర్ల క్లబ్ చదువుకొని మరియు చదువు మధ్యలో ఆపివేసిన వారితో ప్రతి బూత్ స్థాయిలో పాఠశాలలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో ఓటరు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఈ క్లబ్‌ల ద్వారా ఎన్నికల సంఘం తమ కార్యకలాపాలని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఈ లక్ష్యాల సాధనలో భాగంగా దిశా నిర్దేశం చేయడం కోసం వివిధ ప్రభుత్వ శాఖల, విశ్వవిద్యాలయాల, పాఠశాల విద్యా, కళాశాల విద్యా శాఖ, పాత్రికేయరంగ ప్రతినిధులతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అందరు భాగస్వాములై ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి సమితి సభ్యులతో పాఉట హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎన్నికల నమోదు అధికారులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, జె.ఎన్.టి.యు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జిల్లా విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు