కడప జిల్లా, కందులవారి పల్లెలో ఓ మహిళ కత్తిపట్టుకుని హల్‌చల్ చేసింది. వీఆర్వో, కానిస్టేబుల్‌ను తిడుతూ కత్తితో బెదిరించింది. తనతో పెట్టుకుంటే ఉద్యోగాలు ఊడతాయంటూ హెచ్చరించింది. చిట్వేలి మండలం, కందులవారిపల్లె చిట్టికుంట చెరువుకట్టను ఐదు గ్రామాల దళితులు ఉపయోగించుకుంటున్నారు. శ్మశానవాటికకు వెళ్లాలంటే ఈ చెరువుకట్ట పైనుంచి వెళ్లాల్సిందే. అయితే ఈ చెరువు కట్టను అదే గ్రామానికి చెందిన చలపతి, మరికొందరు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దళితులు పిర్యాదు చేయడంతో అధికారులు విచారణ జరిపేందుకు వచ్చారు. ఈ సందర్భంలోనే చలపతి భార్య, కుమార్తె వీరంగం సృష్టించారు. వివాదాస్పద స్థలానికి వెళ్లిన వీఆర్వో, కానిస్టేబుల్‌ను చలపతి భార్య, కుమార్తె బెదిరించారు. తామెలాంటి ఆక్రమణ చేయలేదని, తమ జోలికివస్తే చంపేస్తామంటూ హెచ్చరించారు. చెరువు కబ్జా విషయమై ఉన్నతాధికార్లకు తామెన్నిసార్లు పిర్యాదు చేసినా చలపతి ఆగడాలు ఆగడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే చెరువు కట్టపై హెచ్చరిక బోర్డు పెట్టాలని కోరారు.