eenadubusiness.com

బోనమెత్తిన లష్కర్

*లష్కర్ బోనమెత్తింది. శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ప్రారంభమైంది. అమ్మవారి సాక్షిగా స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతి మరోసారి ఆవిష్కృతమైంది. అమ్మను దర్శించుకునేందుకు వచ్చిన లక్షల మంది భక్తులతో సికింద్రాబాద్ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. జనరల్‌బజార్ జనసంద్రంగా మారింది. వేల మంది తెలంగాణ ఆడబిడ్డలు నెత్తిన బోనమెత్తుకొని.. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. మూడుకిలోల బంగారంతో తయారై.. వజ్రాలతో వన్నెలద్దుకున్న బంగారు బోనం జాతరకు మరింత శోభను తీసుకొచ్చింది. ఎంపీ కల్వకుంట్ల కవిత బంగారు బోనాన్ని ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి రాగా.. 1,016 మంది బోనమెత్తుకున్న మహిళలు అనుసరించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖుల రాక, తెలంగాణ కళా ప్రదర్శనలు జాతరకు మరిన్ని వెలుగులనద్దాయి. ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో జాతర కన్నులపండువగా కొనసాగుతున్నది. *
బోనాల జాతరలో మరో ప్రధాన ఘట్టం మొదలైంది. సికింద్రాబాద్ జనరల్‌బజార్‌లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయ బోనాల జాతర ఆదివారం ప్రారంభమైంది. తెల్లవారుజామున 4:05 గంటలకు ఆలయ పూజారులు మహా మంగళహారతితో తొలి పూజను ప్రారంభించారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలిపూజలో పాల్గొని ఉజ్జయినీ మహంకాళి, మాణిక్యాలమ్మకు పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం తలసాని దంపతులు మహంకాళికి బోనాలు సమర్పించి జాతరను ప్రారంభించారు. బోనాలు సమర్పించేందుకు శనివారం అర్ధరాత్రి ఒంటిగంటకే వేల మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయానికి కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లు నిండిపోయా యి. అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు, సాధారణ భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. వారికి ఆలయ పూజారులు శాస్ర్తోక్తంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అమ్మవార్లకు పూజలు చేసిన తర్వాత బంగారు బోనాన్ని సమర్పించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలు సమర్పించారు. సీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, ఆలయ ఈవో అన్నపూర్ణ ఉన్నారు.