eenadubusiness.com

కరుణానిధి ఆరోగ్యం విషమం – అర్ధరాత్రి ఆస్పత్రికి తరలింపు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఆయన్ను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత హుటాహుటిన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులతోపాటు భారీ సంఖ్యలో డీఎంకే నేతలు కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు.
కాగా, కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడుతోందని, జ్వరం తగ్గిందని డీఎంకే నేతలు స్టాలిన్‌, దురైమురుగన్‌, అళగిరి తదితరులు రాత్రి పదింటి వరకు ప్రకటించారు. వదంతులు నమ్మవద్దని పార్టీశ్రేణులకు భరోసానిస్తూ వచ్చారు. స్టాలిన్‌ సహా ఇతర నేతలంతా కరుణ నివాసం నుంచి వెళ్లిపోయారు.
అయితే, శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.15గంటల ప్రాంతంలో స్టాలిన్‌, అళగిరి, ఎ.రాజా, కనిమొళి, దురైమురుగన్‌ మరోసారి గోపాలపురంలోని కరుణ నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు కావేరి ఆసుపత్రి వైద్యుల బృందం అంబులెన్స్‌తో సహా వచ్చారు. కరుణానిధిని అంబులెన్స్‌లో ఆస్పత్రిలో చేర్చారు.
కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించామని తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యులు డాక్టర్‌ గోపాల్‌ తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని, రక్తపోటు పడిపోయిందని ఆయన వెల్లడించారు. ఆయన్ను ఐసీయూలో చేర్చుతున్నామన్నారు. కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని శనివారం ఉదయం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆయన కుటుంబసభ్యులు, డీఎంకే కార్యకర్తలు ఆస్పత్రి వద్ద నుంచి వెళ్లిపోయారు.
కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ ద్వారా కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌, కుమార్తె కనిమొళిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ‘కరుణానిధి ఆరోగ్యంపై స్టాలిన్‌, కనిమొళితో మాట్లాడాను. ఏదైనా అవసరమైతే చేస్తానని చెప్పాను… ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని మోడీ ట్విట్టర్‌లో వెల్లడించారు.