eenadubusiness.com

చైనాపై ప్రశంసలు… భారత్‌పై నిప్పులు : ఇమ్రాన్ ఖాన్ తొలి ప్రసంగం

పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడుతూ చైనాపై ప్రశంసలు కురిపించారు. భారతదేశంతో సంబంధాల గురించి పాకిస్థాన్ ఐఎస్ఐ తరహాలోనే మాట్లాడారు.

పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐకి 119 స్థానాలు లభించాయి. పీఎంఎల్-ఎన్‌కు 63, పీపీపీకి 38, ఇతరులకు 50 స్థానాలు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 137 మంది సభ్యుల మద్దతు అవసరం.

ఇమ్రాన్ ఖాన్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇస్లామిస్ట్ సంక్షేమ రాజ్యం కోసం కృషి చేస్తానని అన్నారు. బలూచిస్థాన్ ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. పాకిస్థాన్‌లో పేదరికం తీవ్ర సమస్యగా ఉందన్నారు. ఆకలితో ఓ కుక్క మరణించినా అందుకు తాను బాధ్యత వహిస్తానన్నారు. తమ దేశంలో పోషకాహార లోపంతో బాధపడేవారు అధికంగా ఉన్నారని, ప్రజలకు మంచి నీరు అందజేయడంలో కూడా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు.

చట్టాలు సక్రమంగా అమలు చేస్తానన్నారు. ప్రత్యర్థులను రాజకీయ బాధితులను చేయబోనన్నారు. వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తానన్నారు. చట్టానికి వ్యతిరేకంగా నడచుకున్నవారిని తప్పనిసరిగా శిక్షిస్తామని, అయితే వ్యక్తిగత ద్వేషంతో ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లో అవినీతి ఓ కేన్సర్ రోగంలా మారిందన్నారు. చట్టాల్లో లోపాలుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. పరిపాలన వ్యవస్థను సరిదిద్దుతామన్నారు.

పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక రంగంలో సవాళ్ళను ఎదుర్కొంటోందన్నారు. రూపాయి విలువ డాలర్‌తో పోల్చినపుడు పతనమవుతోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తాను కృషి చేస్తానన్నారు. దీని వల్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పెట్టుబడిదారులు దుబాయ్, మలేషియా వెళ్ళిపోతున్నారని, పాకిస్థాన్‌లో పెట్టుబడి పెట్టేందుకు రావడం లేదని, వారిని పాకిస్థాన్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో లేని రీతిలో తన ప్రభుత్వం ఇకపై పరిపాలిస్తుందన్నారు.

పొరుగు దేశాలతో సత్సంబంధాలు అవసరమన్నారు. చైనాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నారు. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌ను ప్రశంసించారు. పేదరిక నిర్మూలనకు చైనా అమలు చేసిన విధానాలను చూసి తాము నేర్చుకోవాల్సి ఉందన్నారు. అవినీతి నిరోధంలో కూడా చైనా విధానాలను అమలు చేయవలసి ఉందన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి నెలకొనేందుకు కృషి చేస్తామన్నారు.

భారత దేశాన్ని ఇమ్రాన్ హిందుస్థాన్ అని సంబోధించారు. హిందుస్థాన్ మీడియా తనను బాలీవుడ్ విలన్‌ మాదిరిగా ప్రచారం చేసిందన్నారు. కశ్మీరు సమస్య తీవ్రమైనదని ఆరోపించారు. కశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. పరస్పర నిందారోపణలు సరి కాదన్నారు. భారతదేశంతో వ్యాపార సంబంధాలు బలోపేతం కావాలన్నారు. భారత్-పాక్ సత్సంబంధాలు ఉప ఖండానికి చాలా ముఖ్యమని చెప్పారు