వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతిఒక్కరూ పాటుపడాలని కోరుతూ, కనీసం ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటాలని హెచ్ఎండీఎ కమీషనర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. తెలంగాణ కు హరిత హారం లో భాగంగా 4 వ విడత కార్యక్రమాన్ని నేడిక్కడ ఘటకేసర్ ఓఆర్ఆర్ ఇంటర్ఛేంజ్ వద్ద హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున విద్యార్ధులతో పాటు హెచ్ఎండీఎ ఉద్యోగులు మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా హెచ్ఎండీఎ కమీషనర్ చిరంజీవులు మాట్లాడుతూ తెలంగాణ కు హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో తాము ఒక కోటి ఆరు లక్షల తొంభై వేల మొక్కలు నాటినట్లు చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రయివేటు రియల్ ఎస్టేటు వ్యాపారులను కూడా భాగస్వామ్యులను చేసినట్లు చెప్పారు. ప్రయివేటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసే లే అవుట్లకు అనుమతులిచ్చే క్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తప్పని సరి చేసినట్లు చెప్పారు. మూసీ నది ప్రక్కన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ వద్ద 9 లక్షల మొక్కలు నాటి గత మూడు సంవత్సరాల కాలంలో పచ్చదనాన్ని పెంపొందించినట్లు చెప్పారు. అలాగే జలాశయాల వద్ద కూడా హెచ్ఎండీఎ ఆధ్వర్యలంో లక్ష మొక్కలు నాటినట్లు చెప్పారు. రేడియల్ రోడ్ల చుట్టూరా 4.8 లక్షల మొక్కలు, పార్కులలో, జాతీయ రహదారి 44 మరియు రోడ్డు మధ్యలోని మీడియన్లలో 18.8 లక్షల మొక్కలు, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృధ్ధి కేంద్రం వద్ద లక్ష మొక్కలు నాటినట్లు చెప్పారు. అంతే కాకుండా గత మూడు విడతల హరిత హారంలో భాగంగా మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలలోని ప్రజలకు, ప్రభుత్వ ప్రయివేటు సంస్ధలకు, స్వచ్ఛంద సంస్ధలకు కోటీ తొంభై లక్షల మొక్కలు పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో 31 నర్సరీల ద్వారా మొక్కల పెంపకాన్ని చేపట్టినట్లు చెప్పారు. హైదరాబాద్ మహానగరానికి ప్రతిష్టాత్మకమైన 156 కి.మీ. పొడవైన అవుటర్ రింగ్ రోడ్డు చుట్టు ప్రక్కల పచ్చదనాన్ని పెంపొందించడానికి మొక్కలు నాటినట్లు కమీషనర్ చెప్పారు. ఈ ఏడాది ఒక కోటి 60 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్ధారించుకున్నట్లు ఆయన చెప్పారు. అంతే కాకుండా నగరంలోని వివిధ పార్కుల్లో పచ్చదనం పెంపొందించడానికి విరివిగా మొక్కల పెంపకం చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎండీఎ అర్బన్ ఫారెస్ట్ విభాగం బి.శ్రీనివాస్, సీఎఓ శరత్ చంద్ర, ఫారెస్ట మేనేజర్ శ్రీనివాస్ తదితర అధికారులు, 1000 మంది విధ్యార్దులు మొక్కలు నాటేకార్యక్రమంలో పాల్గొన్నారు.