www.eenadu.net/02490022SSWAMY93.JPG
న్యూదిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోన్న సమయంలో తన ప్రసంగం ముగియగానే ప్రధాని మోదీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ వైద్య పరీక్షలు చేయించుకోవాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఎవరూ ఊహించని విధంగా రాహుల్ ప్రవర్తించిన తీరును తాను ఖండిస్తున్నానని అన్నారు. తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాహుల్ అలా ఆలింగనం చేయకుండా ఉండాల్సింది. ఇది పార్లమెంటులో ప్రధానమంత్రి భద్రతకు సంబంధించిన అంశం. ఇది కచ్చితంగా అనైతికం. ఇటువంటి ప్రవర్తనను ప్రోత్సహించకుండా ఉంటే.. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగవు’ అని అన్నారు.
కాగా, మోదీని రాహుల్ ఆలింగనం చేసుకున్న విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఈ ఘటనపై బీజేపీ నేతలు స్పందిస్తూ రాహుల్ గాంధీపై మండిపడుతున్నారు. ఆయన తీరు చిన్న పిల్లాడిలా ఉందని, ఆయనకు విషయ పరిజ్ఞానం కూడా లేదని విమర్శలు చేస్తున్నారు. మోదీని ఆలింగనం చేసుకున్న తరువాత లోక్‌సభలో తన స్థానానికి వచ్చి కూర్చున్న రాహుల్ కన్ను కూడా గీటారు.