ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ సహాయ కార్యక్రమాలకు ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి (ప్రేమ్‌రెడ్డి)భారీ విరాళం ఇచ్చారు. కరోనా పేషెంట్ల కోసం రూ. 5 కోట్లు విలువ చేసే 500 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, బిపాప్ మెషిన్లు, ఇతర వైద్య పరికరాలు రాష్ట్రానికి పంపారు. తొలి సహాయంగా ఈ విరాళం ఇచ్చామని, మరింత సహాయం అందిస్తామని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అందరూ ఒక్కతాటిపైకి రావాలని ప్రేమ్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితులు వైద్యరంగం, ఆస్పత్రులపై విపరీతమైన ఒత్తిడి పెంచుతోందన్నారు.ప్రాణాలను నిలబెట్టే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు వంటి అత్యవసర వనరులను పంపుతున్నామని తెలిపారు. కాగా, నెల్లూరు జిల్లా, నిడిగుంటపాలెంకు చెందిన డాక్టర్ ప్రేమ్‌రెడ్డి 70వ దశకంలో అమెరికాకు వెళ్లారు. ఆ దేశంలోని 14 రాష్ట్రాల్లో ప్రైమ్ హెల్త్‌కేర్ పేరిట 46 ఆస్పత్రులను నెలకొల్పారు. ప్రైమ్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.