అమెరికన్లకు ముఖ్యంగా యువతకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కీలక సూచన చేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల యువత ఒకటికి రెండుసార్లు ఆలోచించి తప్పకుండా అందరూ టీకా వేయించుకోవాలని అభ్యర్థించారు. శరవేగంగా ప్రబలుతున్న డెల్టా వేరియంట్ వల్ల ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 50 శాతానికి చేరినట్లు గుర్తు చేశారు. డెల్టా బారినపడుతున్న వారిలో అత్యధికులు యువతనేనని తెలిపారు. కనుక టీకాల పట్ల ఆసక్తి చూపని యువత.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుందని హెచ్చరించారు. ఇక వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న అగ్రరాజ్యం ఈ వారం చివరినాటికి 160 మిలియన్ల మంది అమెరికన్లకు వ్యాక్సినేషన్(రెండు మోతాదులు) పూర్తి చేస్తుందని బైడెన్ వెల్లడించారు.
వైరస్ నుంచి విముక్తికి ఎంతో దూరంలో లేమన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 182 మిలియన్ల మంది అమెరికన్లు కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారని, వీరిలో 90 శాతం మంది వృద్ధులు ఉంటే, 70 శాతం మంది 27 ఏళ్లకు పైబడిన వారు ఉన్నట్లు తెలిపారు. 150 రోజుల్లోనే 300 మిలియన్ల డోసులను పంపిణీ చేశామని, ఈ వారం చివరి నాటికి పూర్తిగా టీకా అందుకున్నవారి సంఖ్య 160 మిలియన్ల మార్కును దాటనుందని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరగడంతోనే ఈ ఏడాది జనవరి నుంచి కరోనా కేసులు, మరణాలు 90 శాతం తగ్గాయని అధ్యక్షుడు పేర్కొన్నారు. అలాగే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న(రెండు డోసులు) దేశ పౌరులు.. కరోనా ముందునాటి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు.
ప్రస్తుతం వైట్‌హౌస్ కొవిడ్ రెస్పాన్స్ టీమ్ ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా యువతలో వ్యాక్సినేషన్‌ను పెంచడంపై దృష్టిసారించినట్లు బైడెన్ చెప్పారు. 12-18 ఏళ్ల వయసు గల పిల్లలు తిరిగి స్కూళ్లకు వెళ్లేముందే టీకాలు తీసుకోవడం మంచిదని సూచించారు. దేశంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, వాణిజ్య సంస్థలు తిరిగి యధావిధిగా తెరుచుకుంటాయని అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, మహమ్మారిపై పోరులో విజయానికి అగ్రరాజ్యం చేరువైందన్న బైడెన్.. కరోనాను పూర్తిగా అధిగమించలేదన్నారు. ఇదిలాఉంటే.. ఇప్పటికీ ప్రతి 10 మంది అమెరికన్లలో ముగ్గురు టీకాల పట్ల ఆసక్తి చూపడం లేదని గత వారం ఆ దేశానికి చెందిన ప్రముఖ న్యూస్ ఏజెన్సీలు నిర్వహించిన పోల్స్ తేల్చాయి. అలాగే 10 మందిలో ఇద్దరు తాము అసలు వ్యాక్సినే తీసుకోబోమని చెప్పినట్లు సమచారం.
TAGS: