eenadubusiness.com

కోవిడ్‌ రోగులకు ఊపిరి ఆడట్లే

కోవిడ్‌ రోగులకు ఊపిరి ఆడట్లే..అందట్లే. బెడ్లు లేక..రోగులను చేర్చుకోక నగర ఆస్పత్రుల్లో విపత్కర..దుర్భర పరిస్థితిలు నెలకొన్నాయి. చికిత్సలో అతిముఖ్యమైన ఆక్సిజన్‌ అందక వందలాది మంది రోగులు విలవిల్లాడుతున్నారు. పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఆక్సిజన్‌ కోసం ఆరేడు ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేక శుక్రవారం ఒక మహిళ అంబులెన్స్‌లోనే మృతిచెందడం ఇందుకు తార్కాణం. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో రోజుకు 384 టన్నుల ఆక్సిజన్‌ అవసరం కాగా..కేవలం 260 టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో వందలాది ఆస్పత్రులు ఆక్సిజన్‌ లేదంటూ సీరియస్‌ రోగులకు అడ్మిషన్లు నిరాకరిస్తున్నాయి. వెంటిలేటర్‌ రోగులను ఇతర ఆస్పత్రులకు వెళ్లాలంటూ వదిలించుకుంటున్నాయి. దీంతో రోగులు, వారి బంధువులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. వెంటిలేటర్లు, వైద్యులు, సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం ఆక్సిజన్‌ లేకపోవడం వల్లే కోవిడ్‌ రోగులను చేర్చుకోవడం లేదు.

‘ఉప్పల్‌ సమీపంలోని 150 పడకల స్పెషాలిటీ ఆస్పత్రి అది. కోవిడ్‌ రోగులకు 30 పడకలు కేటాయించగా, వీటిలో 9 ఐసీయూ వెంటిలేటర్‌ బెడ్లు ఉన్నాయి. ఆక్సిజన్‌ పడకలపై చికిత్స పొందే 25 మందికి రోజుకు 60 లీటర్ల ఆక్సిజన్‌ అవసరమైతే..ఒక్క ఐసీయూ వెంటిలేటర్‌ రోగికే హై ఫ్రీక్వెన్సీలో 60 లీటర్లు అవసరం అవుతుంది. రోగుల అవసరాలకు రోజుకు కనీసం పది సిలిండర్ల ఆక్సిజన్‌ అవసరం కాగా…ప్రస్తుతం రోజుకు ఒకటి రెండుకు మించి సరఫరా కావడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వైద్యులు ఐసీయూ చికిత్సలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉన్న వారిని కూడా ఇతర ఆస్పత్రులకు తరలించారు’