eenadubusiness.com

బలవంతంగా కాక్‌పిట్‌లోకి వెళ్లే ప్రయత్న- తిరిగి వెళ్లిన ఎయిరిండియా విమానం

దిల్లీ: ఎయిరిండియా విమానంలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బలవంతంగా విమానం కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇటలీలోని మిలాన్‌ నగరం నుంచి దిల్లీకి రావాల్సిన ఎయిరిండియా విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం మిలాన్‌ నుంచి టేకాఫ్‌ అయి గంట సేపు ప్రయాణించిన తర్వాత ఓ ప్రయాణికుడు బలవంతంగా కాక్‌పిట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దీంతో పైలట్‌ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి తిరిగి మిలాన్‌లో ల్యాండ్‌ చేశారు. విమానం దిగిన వెంటనే సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. విమానం మిలాన్‌లో షెడ్యూల్‌ ప్రకారం టేకాఫ్‌ అయిన తర్వాత ఏమాత్రం క్రమశిక్షణ లేని గుర్‌ప్రీత్‌ సింగ్‌ అనే ప్రయాణికుడు కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడని ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమానం తిరిగి ఇటలీకి వెళ్లిన తర్వాత అతడిని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 250మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం తిరిగి మిలాన్‌ నుంచి షెడ్యూల్‌ సమయం కంటే రెండున్నర గంటల ఆలస్యం తర్వాత దిల్లీకి బయలుదేరి వెళ్లింది.