eenadubusiness.com

నరికి పాతిపెట్టారు

హత్య చేసి మనుషులను పాతిపెట్టడం గురించి డిటెక్టివ్ కథల్లో చదువుతాం. తర్వాత శవాలు బైటపడడం దర్యాప్తు జరుగడం, చివరికి హంతకులు పట్టుబడడంతో కథ ముగుస్తుంది. ఇక్కడ కొంచెం తేడా.. మనుషులకు బదులు చెట్లను పాతిపెట్టారు. ఇప్పడవి బైటపడడం సంచలనం కలిగిస్తున్నది. ఎవరు కొట్టారు? ఎవరు పాతిపెట్టారు? అనేవి ఇప్పుడు అంతుపట్టని ప్రశ్నలు. ఢిల్లీ గోల్ఫ్‌క్లబ్‌లో ఈ వ్యవహారం చోటుచేసుకున్నది. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. గోల్ఫ్ మైదానంలో తవ్వితే అచ్చంగా డొంకలు కదులుతున్నాయి. ఒకటికాదు రెండుకాదు.. ఏకంగా 895 చెట్ల దుంగలను భూమిలో నిక్షిప్తం చేశారు. అందులో 424 పెద్ద దుంగలు.కొన్ని చివికిపోయి బుర్రలయ్యాయి. అంటే వాటిని పాతిపెట్టి చాలాకాలం అయ్యుంటుంది. మరికొన్ని తాజాగా ఉన్నాయి. అంటే వాటిని ఇటీవలే పాతిపెట్టారన్నమాట. సంగతేంటంటే.. అనుమతి లేకుండా నరికారు. ఆ సంగతి బైట పడుతుందని పాతిపెట్టారు. లోపలి వ్యక్తుల ఫిర్యాదుతోనే ఈ సంగతి బయటకు వచ్చింది. దీనిపై అటవీ అధికారులు హజ్రత్ నిజాముద్దీన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. త్వరలో దర్యాప్తు నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు తెలిపారు. గోల్ఫకోర్స్ అధికారులు తాము పర్యావరణానికి హానిచేసే పనేదీ చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. మరి ఎవరూ నరకకుండా చెట్లు భూమిలోకి ఎలా వెళ్లాయి? అనేది తేలాల్సి ఉంది.