రానున్న రోజుల్లో చెత్త అనేది అతిపెద్ద పరిశ్రమగా రూపొందనుందని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని యువకులు, విద్యార్థినీవిద్యార్థులకు నిర్వహిస్తున్న స్వచ్ఛ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా దాదాపు 500మందికి పైగా యువతీయువకులు హయత్‌నగర్‌లోని ఉష్ణమండల పంటల పరిశోధన కేంద్రం (క్రేడ) ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రేడ డైరెక్టర్ సమ్మిరెడ్డి, కార్పొరేటర్లు సామ తిరుమల్‌రెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, ముద్దగౌని లక్ష్మిప్రసన్న, అడిషనల్ కమిషనర్ కృష్ణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్న ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ నిత్యం వెలువడే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేయడం ద్వారా 75శాతం తిరిగి ఉపయోగించవచ్చునని, ఈ చెత్త ద్వారా ఎరువులు, ఇంధన తయారీకి ప్రత్యేకంగా పరిశ్రమలు రానున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని పాశ్చ్యాత్య దేశాలలో చెత్తను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రతిరోజు లక్షన్నర టన్నుల మున్సిపల్ వ్యర్థ పదార్థాలు వస్తున్నాయని తెలిపారు. ఈ వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేయడానికి ఇంటింటికి రెండు డస్ట్ బిన్‌లను ఉచితంగా అందించినా ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ స్వచ్ఛ రాయబారులుగా మారి ఇంటి నుండే చెత్తను వేరుచేసి స్వచ్ఛ ఆటోలకు అందించేందుకు కృషిచేయాలని యువతీయువకులను కోరారు. ప్రపంచంలో దాదాపు 50దేశాల్లో టిబి, మలేరియా తదితర అంటు వ్యాధులులేవని, వీటికి కారణం స్వచ్ఛతను పాటించడమే అన్నారు. స్వచ్ఛతపై ప్రతిఒక్కరూ సోయి కలిగి ఉండాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో హరితహారంలో భాగంగా 40లక్షల మొక్కలను నాటడంతో పాటు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, నాటిన మొక్కల పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా క్రేడ పరిశోధన కేంద్రంలో వెయ్యి మొక్కలకు పైగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛ శిక్షకులతో కలిసి కమిషనర్ జనార్థన్‌రెడ్డి మొక్కలు నాటారు.