eenadubusiness.com

ప్రతికూల పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చా- పవన్ కల్యాణ్

రాష్ట్ర మంత్రి లోకేశ్‌లా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాలేదని, ఒక్క మాట మాట్లాడితే తెలంగాణ వాళ్లకి కోపం, మాట్లాడకపోతే ఆంధ్ర ప్రజలు తిట్టే ప్రతికూల పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని నిర్మలా దేవి ఫంక్షన్‌హాలులో బస చేసిన ఆయన భీమవరం డీఎన్నార్‌ కళాశాల విద్యార్థినులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి లోకేశ్‌పై విమర్శలు చేశారు. ఏ పనికి ఎంత వస్తుందోననే స్వార్థంతో ఆలోచించి ఆయన అడుగేస్తారన్నారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు తనకు ధైర్యం చాలలేదని, ధైర్యం కూడగట్టుకోవడానికి పదేళ్లు పట్టిందన్నారు. ‘‘ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిలా నేను కూడా తిట్టగలను.. నాదీ బలమైన నోరే. అయితే గొడవలు సమస్యకు పరిష్కారం కాదు. మరో 25 ఏళ్లు నా జీవితాన్ని రాజకీయాలకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. కొత్త తరానికి బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ అందించాలనే తపనతో అడుగేస్తున్నాను’’ అని పవన్‌ స్పష్టం చేశారు. మహిళల భద్రతే జనసేన పార్టీ ప్రధాన అజెండా అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కొడుకే సీఎం అవ్వాలా? రాజకీయాలను డబ్బుతో ముడిపెట్టేశారని, ఎమ్మెల్యేగా గెలవాలంటే రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లు ఉండాలన్న స్థాయికి రాజకీయాలు తీసుకెళ్లి సామాన్యుడికి అందకుండా చేస్తున్నారని పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కొడుకే ముఖ్యమంత్రి అవ్వాలా? ఒక న్యాయవాది, రైతు కూలీ, బిడ్డలు సీఎం కాకూడదా? అని ప్రశ్నించారు.