eenadubusiness.com

ఓ మేక పిల్లను ప్రాణాలకు తెగించి కాపాడారు

ఓ మేక పిల్లను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు ఆ యువకులు. పొరపాటు జరిగితే తమ ప్రాణాలు పోతాయని తెలిసినా.. ఆ మేక పిల్ల ప్రాణాలు కాపాడిన యువకులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మేకపిల్లను కాపాడిన ‘రెస్క్యూ ఆపరేషన్’ వీడియో వైరల్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఓ అటవీ ప్రాంతంలో మేతకోసమని వచ్చిన మేకపిల్ల తెరిచివున్న బోరుబావిలో పడిపోయింది. దీన్ని గమనించిన యువకులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ మేక పిల్లను ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకున్నారు.
ఆ యువకుల్లో ఓ వ్యక్తిని ఆ బోరుబావిలోకి తలకిందులుగా లోపలికి పంపి.. ఆ మేక పిల్లను బయటకు తీశారు. అక్కడున్న మరో వ్యక్తి దీన్నంతా వీడియో తీసీ సోషల్ మీడియాల్లో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కొందరైతే ‘ది ఇండియన్‌ రెస్క్యూ మిషన్‌’ అనిపేర్కనగా, ‘ఇది మరో థాయ్‌లాండ్‌ తరహా సాహసం’, అని ‘వీళ్లను చూస్తుంటే మానవత్వం ఇంకా బతికే ఉంది. మనుషులకు జంతువుల మీద కొంతైనా దయ మిగిలే ఉంది’ ‘ఇదో అద్భుత సాహసం’, ‘వారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం’, ‘ఆ మేక పిల్ల ఎవరి పళ్లెంలోనూ భోజనం కాకూడదని కోరుకుంటున్నా’ అని నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఏది ఏమైనా వారు చేసిన సాహసాన్ని మాత్రం ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.