eenadubusiness.com

గ్రేట‌ర్‌లో రానున్న మ‌రో 180 లూ-కేఫేలు

గ్రేట‌ర్ హైదరాబాద్ న‌గ‌రంలో కొత్త‌గా 180 లూ-కేఫేల‌ను ఏర్పాటు చేయ‌డానికి జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే ప్ర‌యోగాత్మ‌కంగా మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా ఏర్పాటుచేసిన లూ-కేఫేను న‌గ‌ర‌వాసుల‌కు గ‌ణ‌నీయంగా ఉప‌యోగ‌ప‌డుతుండ‌డంతో న‌గ‌ర‌వ్యాప్తంగా 180 కొత్త లూ-కేఫేల‌ను ఏర్పాటు చేయ‌డానికి టెండ‌ర్ల‌ను ఆహ్వానిస్తూ జీహెచ్ఎంసీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఖైర‌తాబాద్ జోన్‌లో 36, కూక‌ట్‌ప‌ల్లి జోన్ ప‌రిధిలో 22, మిగిలిన జోన్‌ల‌యిన చార్మినార్‌, శేరిలింగంప‌ల్లి, సికింద్రాబాద్‌, ఎల్బీన‌గ‌ర్ జోన్‌ల ప‌రిధిలో 30 చొప్పున ఏర్పాటు చేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. న‌గ‌రంలో మ‌రిన్ని టాయిలెట్లు అందుబాటులో తీసుకొని రావాల‌ని రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించ‌డంతో ఇండోర్‌లో లూ-కేఫేలు ప‌టిష్టంగా న‌డుస్తున్నాయ‌ని గ‌మ‌నించారు. దేశంలోనే స్వ‌చ్ఛ న‌గ‌రంగా ప్ర‌క‌టించ‌బ‌డ్డ ఇండోర్‌లో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డిల‌తో పాటు జీహెచ్ఎంసీ సీనియ‌ర్ అధికారులు ఇండోర్‌లో ప‌ర్య‌టించి, అక్క‌డ న‌గ‌ర‌వాసుల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. బి.ఓ.టి ప‌ద్ద‌తిలో ఇండోర్‌లో నిర్వ‌హిస్తున్న మాదిరిగానే జీహెచ్ఎంసీకి ఏవిధ‌మైన ఆర్థిక భారంలేకుండా ఉండేవిధంగా డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆప‌రేట్‌, ట్రాన్స్‌ప‌ర్ ప‌ద్ద‌తిన లూ-కేఫేల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకుగాను న‌గ‌రంలో 25×15 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని కేటాయించి, నీటి స‌ర‌ఫ‌రా సీవ‌రేజి లైన్‌ల ఏర్పాటును జీహెచ్ఎంసీ క‌ల్పిస్తుంది. *లూ-కేఫేలు* పూర్తిగా ఎయిర్ కండీష‌న్‌ లో ఉంటాయని, అందులో న్యాప్కిన్ వెడింగ్ మిష‌న్లు, న్యాప్కిన్ ఇన్‌సిన‌రేట‌ర్‌, కిడ్స్ డైప‌ర్ చేంజింగ్ రూం, కేఫే, వైఫై సౌక‌ర్యం, వాట‌ర్ ఏటిఎం, బ్యాంకు ఏటిఎంలు లాంటి సౌకర్యాలు ఉంటాయి. అంతే కాకుండా లూ-కేఫెల‌ను మ‌హిళ‌లు, దివ్యాంగుల‌కు ఉచితంగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. లూ-కేఫేలో 20 రూపాయ‌ల‌తో కొనుగోలు చేసిన వారికి ఇందులోని టాయిలెట్లు ఉచితంగా ఉప‌యోగించుకునే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తారు. ఏమి కొనుగోలు చేయ‌నివారు, 20 రూపాయ‌లలోపు కొనుగోలు చేసేవారు మాత్రం టాయిలెట్‌ల‌ను ఉప‌యోగిస్తే 5 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అందరికి ఉచితంగా ఈ లూ-కేఫేను ఉప‌యోగించుకోవ‌డానికి అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని యోచ‌న కూడా జీహెచ్ఎంసీ చేస్తోంది. ఇప్ప‌టికే టాయిలెట్ల నిర్వ‌హ‌ణ రంగంలో అనుభ‌వం క‌లిగి ప్ర‌ధాన కూడ‌ళ్లు, రైల్వే, బ‌స్‌స్టేష‌న్ల‌, ఎయిర్‌పోర్టు, మార్కెట్ మాల్స్‌ల‌లో నిర్వ‌హించే వారికి టెండ‌ర్ల‌లో పాల్గొనేందుకు ప్రాధాన్య‌త క‌ల్పించారు. అయితే, ఈ టెండ‌ర్ల‌లో పాల్గొని విజ‌య‌వంతంగా ద‌క్కించుకున్న టెండ‌రుదారు జీహెచ్ఎంసీ నిర్థారించిన విధానాన్ని అనుస‌రించి వార్షిక ఫీజు, అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్ ఫీజుల‌ను చెల్లించాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అధ్య‌య‌నం చేసి ఈ టెండ‌ర్ల ప్ర‌క్రియ నిర్థారించింది..