eenadubusiness.com

వర్మ మళ్లీ ఇదే చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

‘‘RX 100’ సినిమాను వీక్షించేందుకు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించారు’ అంటూ గురువారం ఆ చిత్ర బృందాన్ని మెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మళ్లీ ఇదే చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వర్మ దగ్గర శిక్షణ తీసుకున్న అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన చిత్రమిది. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించారు. రాంకీ, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్‌ లభించింది. విభిన్న కథాంశంతో సినిమాను చక్కగా రూపొందించారంటూ విమర్శకులు ప్రశంసించారు.
ఈ నేపథ్యంలో వర్మ ఫేస్‌బుక్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ చేశారు. తన వద్ద శిక్షణ తీసుకున్న అజయ్‌ భూపతి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయాలని ఉందని తెలిపారు. ‘‘RX 100’ విజృంభిస్తోంది. నన్ను తన తర్వాతి చిత్రానికి అసిస్టెంట్‌గా పెట్టుకోమని నా మాజీ అసిస్టెంట్‌ అజయ్‌ భూపతిని కోరుతున్నాను’ అంటూ వర్మ పరోక్షంగా ఆయన్ను అభినందించారు.
వర్మ ఇటీవల ‘ఆఫీసర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం వర్మ ‘గెహెర్‌’, ‘రాయ్‌’ అనే హిందీ సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.