Eenadu Business

హెచ్ఎండీఏలో సగానికి సగం పోస్టులు ఖాళీ – Eenadu Business

హెచ్ఎండీఏలో సగానికి సగం పోస్టులు ఖాళీ

హైదరాబాద్‌తోపాటు నగర శివారులోని ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న హెచ్‌ఎండీఏ సగానికి సగం ఖాళీ అయింది. హెచ్‌ఎండీఏలో సుమారు 600పోస్టులుండగా, ప్రస్తుతం రెగ్యులర్‌ ఉద్యోగులు 300మందికే చేరారు. మిగతా 300మంది ఉద్యోగ విరమణ పొందారు. ప్రతి నెలా రిటైర్డ్‌ అవడమే తప్ప, కొత్తగా పోస్టుల భర్తీ లేకపోవడంతో పలు విభాగాల్లో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. ఔట్‌ సోర్సింగ్‌లోనూ నామమాత్రపు నియమాకాలే జరిపారు. దాంతో టౌన్‌ ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ గ్రోత కారిడార్‌ లిమిటెడ్‌తో పాటు ఇతర విభాగాల్లో ఉద్యోగులపై పని భారం పెరిగింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న పలు ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న హెచ్‌ఎండీఏలో ఉద్యోగుల కొరత తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది.
హుడా నుంచి హెచఎండీఏగా ఏర్పడినప్పటి నుంచి ఖాళీలను భర్తీ చేయని ఫలితంగా ఉన్న ఉద్యోగులే రెండింతల పని భారాన్ని మోస్తున్నారు. డిప్యూటేషన ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు. ఏకీకృత మాస్టర్‌ప్లానుతో పాటు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల అమలుకు ఉద్యోగుల కొరత అడ్డంకిగా మారుతోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారాన్ని ప్లానింగ్‌ ఉద్యోగులతోపాటు రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సహకారంతో గట్టేక్కించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పలు శాఖల్లో నియామకాలు చేపట్టినా, హెచ్‌ఎండీఏలో ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదు. హెచఎండీఏ వ్యవహారాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ నేతృత్వంలో గతంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ రెండుసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి అత్యవసరంగా ఖాళీల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. కమిషనర్‌ కూడా లేఖ రాశారు. అయినా ఫలితం లేదు. ఈ ఏడాది హెచ్‌ఎండీఏలో 27మంది రిటైర్డ్‌ కావాల్సి ఉండగా, శనివారం ఎనిమిది ఉద్యోగ విరమణ పొందుతున్నారు. వారితో ఈ ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ పొందిన వారి సంఖ్య 17కి చేరుతోంది.
మహానగర శివారు ప్రాంతాల్లో భవిష్యత అభివృద్ధికి బాటలు వేసే హెచ్‌ఎండీఏలోని ప్లానింగ్‌ విభాగంలో కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధి చేస్తున్న హెచ్‌ఎండీఏలో ఇది పెద్ద సమస్యగా మారింది. ఉన్నవారితోనే ప్రణాళికా విభాగంలో భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులిస్తున్నారు. అర్హులైన ఉన్నతాధికారులను నియమించడం లేదు. ఫలితంగా ఇనచార్జీలుగా ఉన్న అధికారులు ప్రణాళికా విభాగానికి న్యాయం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కమిషనరే ఎప్పటికప్పుడు ప్రణాళికా విభాగంపై పర్యవేక్షణ చేయాల్సి వస్తోంది. క్షేత్రస్థాయి పర్యవేక్షణకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్లానింగ్‌ విభాగంలో 110 మంది అధికారులు, ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, డిప్యూటేషన్‌పై వచ్చిన వారితో కలిసి 60 మంది మాత్రమే ఉన్నారు. ఏపీఓ, జేపీఓ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కీలకపాత్ర పోషించే సర్వేయర్లు 15మందికి గాను ముగ్గురు ఉన్నారు.కార్యాలయంలో రికార్డులు, ఇతరత్రా నిర్వహణ బాధ్యతలు చూసే ఉద్యోగుల పోస్టులు కొన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. హెచ్‌ఎండీఏ కార్యదర్శి ఉద్యోగోన్నతిపై వెళ్లగా, ఇన్‌చార్జి బాధ్యతలను ఏస్టేట్‌ అధికారి నిర్వహిస్తున్నారు. పరిపాలన, అకౌంట్స్‌ విభాగాలకు 334 పోస్టులకుగాను 140మంది మాత్రమే ఉన్నారు. సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు ఆరుకు ఆరు, సీనియర్‌ స్టెనో పోస్టులు తొమ్మిదికి తొమ్మిది, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు 15కు 15, టైపిస్టు పోస్టులు 16కు 16 ఖాళీగా ఉన్నాయి.
కంప్యూటర్‌ ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్‌పై నియమించుకున్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 45కి గాను 13మంది మాత్రమే ఉన్నారు. సీనియర్‌ అసిస్టెంట్లు 33మంది అవసరం కాగా, ఆరుగురే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో కీలకమైన అర్బన్‌ ఫారెసీ్ట్ర విభాగంలో 37 పోస్టులకు 17 ఖాళీగా ఉన్నాయి. ఎన్ ఫోర్స్‌మెంట్‌ విభాగంలో ఇన్ స్పెక్టర్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు ప్లైఓవర్లు, పార్కులు, పలు సుందరీకరణ పనులకు శ్రీకారం చుడుతున్న డెవల్‌పమెంట్‌ విభాగంలో 110 పోస్టులు ఉండగా 60 మంది వరకు ఉద్యోగులు లేరు. డీఈలు, ఏఈఈలు, ఏఈల కొరత తీవ్రంగా ఉంది.
Image result for hyderabad metropolitan development authority

Previous
Next