Eenadu Business

ప్రారంభ‌మైన మూసి ప్ర‌క్షాళ‌న‌ – Eenadu Business

ప్రారంభ‌మైన మూసి ప్ర‌క్షాళ‌న‌

మూసిన‌ది ప్ర‌క్షాళ‌న‌లో తొలి అంకమైన మూసిలోని భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల తొల‌గింపు ప్ర‌క్రియ‌ను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 57కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్న మూసిలో దాదాపు 12 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాలు ఉన్నాయ‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేశారు. మూసిన‌దిని ప్ర‌క్షాళ‌న‌చేసి సుంద‌రీక‌రించాల‌ని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేయ‌డంతో జీహెచ్ఎంసి త‌న‌వంతుగా మూసిలోని భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌ను తొల‌గించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఇందుకుగాను తొలిద‌శ‌లో 50 ట్ర‌క్‌లు, ప‌ది జెసిబిల‌ను నిర్మాణ వ్యర్థాలను తొల‌గించేందుకు కేటాయించింది. ఒక్కో ట్ర‌క్ ద్వారా రోజుకు నాలుగు ట్రిప్పుల చొప్పున 50 టిప్ప‌ర్ల ద్వారా క‌నీసం 200 లోడ్ల నిర్మాణ వ్య‌ర్థాల‌ను త‌ర‌లించ‌నున్నారు. ఇప్ప‌టికే ర‌హ‌దారులు, నాలాల ప్ర‌క్క‌న ఉన్న నిర్మాణ వ్య‌ర్థాల‌ను త‌ర‌లించే ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది. కాగా మూసిన‌దిపై అంబ‌ర్‌పేట్ రెవెన్యూ మండ‌ల ప‌రిదిలో చాద‌ర్‌ఘాట్ వ‌హ‌దాద్‌న‌గ‌ర్‌, తుల‌సీన‌గ‌ర్‌, దుర్గాన‌గ‌ర్‌ల‌లోనూ హిమాయ‌త్‌న‌గ‌ర్ మండంలోని చాద‌ర్‌ఘాట్ బ్రిడ్జి స‌మీపంలోని సాయిబాబా గుడి వెనుక వైపు, నాంప‌ల్లి మండ‌లంలోని శివాజి బ్రిడ్జి, చార్మినార్ మండ‌లంలోని ద‌ర్బార్ మైస‌మ్మ టెంపుల్ వెనుక‌వైపు, సైదాబాద్ మండలంలోని తీగ‌ల‌గూడ‌, మూసారాంబాగ్‌, రాజేంద్ర‌న‌గ‌ర్ మండలంలోని జియాగూడ క‌మేలా స‌మీపంలో, ఉప్ప‌ల్ మండ‌లంలోని దేవేంద‌ర్‌న‌గ‌ర్‌, నాగోల్ బ్రిడ్జి ఎడ‌మ వైపు, మేడిప‌ల్లి మండ‌లంలోని ప‌ర్వాత‌పూర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఉన్న మూసిలో పెద్ద ఎత్తున భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాలు ఉన్నాయ‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేశారు. ఇప్ప‌టికే నిర్మాణ వ్య‌ర్థాల‌ను మూసిలో వేయ‌కుండా మూసిపై ప్ర‌హ‌రీగోడ నిర్మాణం, మిష్ ఏర్పాటు, నిర్మాణ వ్య‌ర్థాల‌ను వేసేవారిని గుర్తించి కేసులు న‌మోదు చేయ‌డం, సీసీ కెమెరాల ద్వారా అక్ర‌మంగా వేసేవారిని గుర్తించ‌డం త‌దిత‌ర చ‌ర్య‌ల‌ను జీహెచ్ఎంసీ చేప‌ట్టింది. దీనిలో భాగంగా ఇప్ప‌టికే చెరువులు, ప్ర‌ధాన ర‌హ‌దారులు, నాలాల వెంట ఉన్న భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌ను జీహెచ్ఎంసీ తొల‌గించే ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. దాదాపు ల‌క్ష మెట్రిక్ ట‌న్నుల నిర్మాణ వ్య‌ర్థాల‌ను తొల‌గించింది. తొల‌గించిన నిర్మాణ వ్య‌ర్థాల‌ను ఫ‌తుల్ల‌గూడ‌, జీడిమెట్ల‌, కొత్వాల్‌గూడల‌కు త‌ర‌లిస్తున్నారు.

Previous
Next