Eenadu Business

తెలుగుదేశం ఎంపీలు దిల్లీలో ఆందోళన – Eenadu Business

తెలుగుదేశం ఎంపీలు దిల్లీలో ఆందోళన

విభజన హామీల అమలు కోరుతూ తెలుగుదేశం ఎంపీలు దిల్లీలో ఆందోళన ఉద్ధృతం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ సత్యసాయి వేషధారణలో నిరసన తెలిపారు. మోదీ సర్కార్‌పై వాగ్బాణాలు సంధించారు.
‘నేను అనంతపురం జిల్లాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా భక్తులను సంపాదించుకోగలిగాను. నాకు వచ్చిన నిధులతో ప్రజాహిత కార్యక్రమాలు చేశారు. సత్యసాయి ట్రస్టు ద్వారా అనేక గ్రామాలకు తాగునీరు అందించాను. విద్యాలయాలు, ఆస్పత్రులు నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచాను. 2004లో మోదీ నా దగ్గరకు వచ్చారు. నువ్వు భవిష్యత్తులో తప్పకుండా ప్రధానమంత్రి అవుతావని ఆశీర్వదించాను. కానీ ప్రధాని అయ్యాక మోదీ ఆ స్థాయికి తగ్గట్లుగా ప్రవర్తించడం లేదు. దీంతో ఆనాడు నేనిచ్చిన సందేశాలు ఆయనకు గుర్తుచేయడానికే ఇక్కడికి వచ్చాను. మోదీ ఇచ్చిన మాట తప్పుతారు. ధర్మాన్ని ఏకోశాన పాటించరు. యోగాసనాలు వేస్తూ ఫోటోలకు ఫోజులిస్తాడు తప్ప శాంత స్వరూపుడేమీ కాదు. గుజరాత్‌లో నరమేధం సృష్టించాడు. అన్ని విధాలుగా పతనమైపోయిన మోదీ ప్రజలకు దూరమైపోయాడు. తెలుగు ప్రజలు చాలా గొప్పవారు. వారి ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోరు. అందుకే జాగ్రత్తగా ఉండమని చెబుతున్నా. తెలుగు ప్రజల దెబ్బ రుచి చూడాలంటే ఇంకా తప్పులు చెయ్‌. వారు నిన్ను క్షమించరు. నీ పతనాన్ని చూస్తారు. మోదీ పతనం ఖాయం. గతంలో ఆయనకు ఇచ్చిన ఆశీర్వచనాలను వెనక్కి తీసుకుంటున్నా’ అని సత్యసాయి వేషధారణలో ఉన్న శివప్రసాద్‌ అన్నారు.

Previous
Next